Dr. A. Taralakshmi:

సత్యాభిసంధి


"నాయనా శ్వేతకేతు !
నీవు బ్రహ్మచర్యాన్ని చేపట్టి , గురువును చేరి, శాస్త్ర విద్య ను సముపార్జించు. మన వంశం లో వేదాధ్యయనము చేయని వారు, నేను బ్రాహ్మణుడను అను దురభిమానము కలిగిన వారు ఇప్పటి వరకు జన్మించనేలేదు" అంటూ విచారంగా వాపోయాడు ఉద్ధాలకుడు. 
పన్నెండు ఏళ్ల ప్రాయం వచ్చినా విద్యాభిరుచి కలుగని శ్వేతకేతువుకు తండ్రిగారి మాటలు బాణాల వలె హృదయంలో నాటుకున్నాయి.
తల్లి తండ్రులఆశీర్వాదం తీసుకుని ప్రాచీనసీలుని ఆశ్రమము చేరి, అచట పన్నెండు ఏండ్లు వేదశాస్త్రము లు అధ్యయనము చేసి, గురువు అనుగ్రహంతో తిరిగి గృహాన్ని చేరాడు.
శ్వేతకేతువు లో క్రమంగా విద్యాగర్వం పొడసూపడం తండ్రిగారు గమనించి కుమారుని లో పెరిగిన అతిశయాన్ని ఆదిలోనే సంస్కరించాలని భావించాడు.
కుమారుని దగ్గర కు తీసికొని, ఇలా ప్రశ్నించాడు.
" కుమారా! దేనిని తెలుసుకుంటే సమస్తమూ తెలియబడుతుందొ , అటువంటి బ్రహ్మోపదేశాన్ని నీ గురువు నుండి నీవు ఉపదేశం పొందావా? " అని ప్రశ్నించారు.
శ్వేతకేతువు ఆశ్చర్య చకితు డైనాడు. తాను అధ్యయనము చేయ వలసినది ఇంకా ఎంతో వున్నదని గ్రహించాడు. వినయం పెరిగింది.
తండ్రిని ఇలా ప్రార్థించాడు." తండ్రీ! గురువుగారు ఈ విద్య నాకు నేర్పలేదు. కావున దయచేసి మీరు ఆ తత్వాన్ని నాకు బోధ చేయండి అని ప్రార్థించాడు.
ఉద్దాలకుడు ఉపదేశం ప్రారంభించాడు.
కుమారా!
మట్టితో అనేక రూపాలలో పాత్రలు, బొమ్మలు తయారవుతున్నాయి. బంగారం నుండి అనేకఆభరణాలు తయారవుతున్నాయి. సముద్రం లో అనేక తరంగాలు ఏర్పడుతున్నాయి. పాత్రలు, బొమ్మలు ఎన్ని రూపాలలో వున్నా అందు వున్న మూల పదార్థము మట్టి మాత్రమే.
ఆభరణాలు ఎన్ని రకాలుగా వున్నా అందు వున్న మూల పదార్థము బంగారమే. 
అలాగే సముద్రంలో లేచే తరంగాలన్నీ సముద్రం కంటే వేరు కాదు.
ఈ మొత్తం ప్రపంచం కొన్ని కోట్ల రూపాలలో కనిపిస్తోంది. కానీ వీటి అన్నింటా వ్యాపించి ఉన్న మూల పదార్థము ఒక్కటే. అదే సత్ అదే చిత్. 
ఆ మూలపదార్థమే ఆత్మ.
రూపాలు లేకున్నా మూల పదర్థముంటుంది. మూల పదార్థం లేకుంటే రూపాలు వుండవు.
కావున పైకి కనిపించే నామ రూపాలు అసత్యం . ఆ మూల పదార్థమే సత్యము. అది సూక్ష్మాతి సూక్ష్మం కావున నేత్రాలకు గోచరము కాదు అన్నాడు ఉద్ధాలకుడు.
ఇది విన్న శ్వేతకేతువు తండ్రితో " మీరు ఈ మూల తత్వం సూక్ష్మ మైనదని, కనులకు గోచరము కాదు అంటున్నారు కదా? మరి అంతటి సూక్ష్మ మైనదాని నుండి స్థూలాతి స్థూలమైన ఈ సృష్టి ఎలా ఉత్పన్నమైంది?
దయచేసి వివరించండి అన్నాడు.
కుమారుని జిజ్ఞాస ను గమనించిన తండ్రీ ఇలా వివరించ సాగాడు.
శ్వేత కేతు! ఆ కనిపించే మఱ్ఱి పండును తీసుకుని రా! అని ఆదేశించి, ఆ పండులో ఏముందో చూడమన్నాడు. కుమారుడు పండును వలిచి చిన్న చిన్న విత్తనాలను గమనించాడు. అందులో ఓ విత్తనాన్ని విభజించి పరిశీలించ మన్నాడు తండ్రి.
అందు నీకు ఏమి కనిపిస్తోంది అన్న తండ్రి ప్రశ్నకు సమాధానంగా ఏమి కనిపించడం లేదు అని సమాధానమిచ్చాడు శ్వేత కేతు.
చుచావా? ఇంత చిన్న మర్రి విత్తనం నుండి అంత పెద్ద మర్రి వృక్షం ఎలా ఉత్పన్నం అయిందో, అలాగే సూక్ష్మ మైన అవ్యక్తమైన ఆత్మ తత్వము నుండి నామ రూపాత్మకమైన ఈ స్థూల జగత్తు ఏర్పడింది అన్నాడు ఉద్ధాలకుడు. 
వెంటనే శ్వేతకేతు " తండ్రీ! ఈ సత్ పదార్థము అతి సూక్ష్మమై నందున కంటికి కనిపించక పోవచ్చును.అయితే ఇది సర్వత్రా ఎలా వ్యాపించి ఉంది? దయతో అనుగ్రహించండి" అని ప్రార్థించాడు.
ఉ ద్ధాలకుడు ఓ చిన్న పాత్ర లో నీటిని తెప్పించి, అందు కొంత ఉప్పును కరిగించి, ఇపుడు నీకు నీటిలోఉప్పు వేరుగా కనిపిస్తోందా? అనిప్రశ్నించాడు .
లేదు అన్నాడు కుమారుడు.
నీటిని రుచి చూడమన్నాడు తండ్రి. వుప్పగా ఉందన్నాడు కుమారుడు.
నీటిలో కరిగిన ఉప్పు నీకు కనిపించక పోయినా, అది అవ్యక్తంగా నీటి అంతటా ఎలా వ్యాపించి వుందో అలాగే సత్ చిత్ ఆనంద పరమాత్మ రూపం, మూల పదార్థం గా ఈ జగత్తు అంతటా వ్యాపించి ఉంటుంది. ఆ సత్ చిత్ ఆనంద పరమాత్మ స్వరూపం నీవే అయి ఉన్నావు.
తత్ త్వం అసి అంటూ, కుమారునకు తత్వమసి మహావాక్యాన్ని ఉపదేశించాడు, ఉద్ధాలకుడు.


Comments
Post a Comment