Dr. A. Taralakshmi: 

ఎవరి ప్రేరణతో


ఎవరి ప్రేరణతో మనస్సు విషయాల పై సంచరిస్తోంది? 
ప్రాణము ఎవరి ప్రేరణతో క్రియాశీలక మవుతూ వుంది?
వాక్కు ఎవరి ప్రేరణతో మాట్లాడుతూ వుంది?
చెవి ఎవరి ప్రేరణతో వింటూ వుంది?
ఇంద్రియాలను ఎవరు ప్రేరేపిస్తూ ఉన్నారు?
పై ప్రశ్నలు, అనాదిగా మానవుని ఆలోచింప చేస్తున్నాయి.
కేనోనిషత్తుఋషి, పై ప్రశ్నలన్నిటికీ క్రింది విధంగా సమాధనం ఇస్తూఉన్నారు.
ఏది చెవికి చెవియో, వాక్కుకు వాక్కో, నేత్రమునకు నేత్రమో మనస్సునకు మనసో, అదియే పరబ్రహ్మము.
అది కంటికి కనపడదు, చెవికి వినబడదు. మనస్సు ద్వార తెలుసు కోబడదు. కాబట్టి మనం దానిని భౌతిక వస్తువు వలె తెలిసి కొనలేము. దీనిని గురించి ఇతరులకు వర్ణించి వివరించలేము.
ఇదియే ఆ పరబ్రహ్మ చైతన్యము, అధిష్టాన దైవం
.
ఇది మనస్సు చేత మననము చేయబడజాలదు కానీ దీని ప్రభావం చేతనే మనస్సుకు మనన శక్తి లభిస్తుంది. ఈ పరమాత్మ చైతన్యం సాన్నిధ్యం లోనే అన్నిఇంద్రియాలు,మనస్సు, మరియు బుద్ధి ప్రేరేపించ బడుతున్నాయి.
ఈ పరబ్రహ్మము కంటికి కనిపించే స్థూల ప్రకృతి కంటెను, కనిపించని అవ్యాకృతము కంటెను భిన్నమైనది. పరబ్రహ్మము దృశ్య పదార్థము కాదు. ఎవరైతే పరబ్రహ్మ తత్వాన్ని తెలిసికొన్నన్నాను, అంటూ వున్నాడో వానికి పరబ్రహ్మము ఏమాత్రము తెలియనట్లే. ఎవరైతే పరబ్రహ్మ తత్వాన్ని తెలియదని అంటున్నాడో వాడే బ్రహ్మమును బాగుగా ఎరిగినవాడు.
ఋషి పై జ్ఞానాన్ని వివరించుట కొరకు ఓ దృష్టాంతాన్ని చెప్తున్నారు.
దేవతలకు రాక్షసులకు ఓ మారు పెద్ద యుద్ధం జరిగింది. దేవతలు రాక్షసులను జయించారు. దేవతలలో గర్వం పొడసూపింది. తమ విజయానికి కారణం పరబ్రహ్మము అన్న వివేకాన్ని మరచి అహంకరించారు.
పరబ్రహ్మ దేవతల గర్వాన్ని గమనించారు. వారికి గుణపాఠం నేర్పాలని అనుకున్నారు. ఆ రోజు ఇంద్రుని పట్టణం అమరావతి లోని నందనవనం లో ఇంద్రుని దర్బారు జరుగుతోంది. పరబ్రహ్మ యక్షుని రూపంలో వారి ముందు ప్రత్యక్షమయ్యారు. దేవతలకు ఆశ్చర్యం కలిగింది. ఆయక్షుని తత్వం వారికి అవగతం కాలేదు. దానిని తెలిసికొన డానికి అగ్ని దేవుని సమర్ధునిగా భావించి, తత్వాన్ని తెలిసికొని రమ్మని వారిని యక్షుని వద్దకు పంపారు. యక్షుడు చూపిన చిన్న గడ్డి పరకను సైతం అగ్ని దేవుడు దహింప లేకపోయారు. తదుపరి వాయుదేవుని పం పగా వారు కూడా ఆ గడ్డిపరక ను తనశక్తి చేత కనీసం కదపలేక పోయారు. చివరగా దేవేంద్రుడు వెళ్ళగా ఆ యక్షుడు అంతర్ధానమయ్యి ఉమా దేవి ప్రత్యక్షమవుతుంది.
అంతట దేవేంద్రుడు "దేవీ దేవతల నందరినీ భయభ్రాంతులను చేసిన ఆ యక్షుడు ఎవరు? " అని ప్రశ్నించగా , దేవి
" ఇంద్రా! ఆ యక్ష రూపం సాక్షాత్తుపరబ్రహ్మము.
అన్నింటా అంతర్యామిగా వుండే ఆ బ్రహ్మమే యుద్ధంలో మీ విజయానికి కారణం. ఈ విషయాన్ని తెలిసికొనలేక మీరు మిధ్యాభిమానులైనారు. మీ అందరిలో వున్న శక్తి ఆ పరబ్రహ్మమే అన్న సత్యాన్ని విస్మరించారు.
మీ అతిశయాన్ని పోగొట్టుట కొరకే, పరబ్రహ్మ తత్వాన్ని తెలి య జేయుట కొరకే ఈ పరీక్ష" అని ఉపదేశించి, దేవి అంతర్ధానం అయ్యింది.
దుర్లభమైన మానవ జన్మను పొందిన మానవుడు పరబ్రహ్మమును గూర్చితెలిసికొనినచో , ఆతనికి బ్రహ్మానందం సిద్ధిన్చునని , ఈ జన్మలో పరమాత్మను గూర్చి తెలిసికొన లేక పోయినచో గొప్ప వినాశనము సంభవించునని, ధీరులు సమస్త భూతమలను యందు ఏకమై వున్న ఆత్మతత్వము తెలిసికొని ఈ శరీరము నుండి వేరుపడి జనన మరణ రహితు డగుచున్నాడని ఉపదేసిస్తు , ఉపనిషత్తు ముగుస్తుంది.

Comments
Post a Comment