Dr. A. Taralakshmi: 
పంచ కోశాలు


వరుణ దేవుని కుమారుడైన భృగువు ఓసారి తండ్రిని సమీపించి నమస్కరించి, తనకు బ్రహ్మ జ్ఞానాన్ని ఉపదేశించమని సవినయంగా అభ్యర్థించాడు. 
అందుకు వరుణుడు సంతసించి, ఇలా వివరించాడు."బ్రహ్మాదిస్థంబ పర్యంతము గల సమస్త ప్రాణులన్నీ దేని నుండి ఆవిర్భవించుచున్నవో దేని యందు జీవించుచున్నవో , దేనియందు లయించుచున్నవో, అదియే బ్రహ్మము.
అట్టి బ్రహ్మమును ఎరుగవలయును. అని భృగువు కు సూచించారు.
పై ప్రకారంగా తండ్రి వరుణుడు భృగువుకు ఉపదేసించగ తండ్రి ఆజ్ఞ మేరకు భృగువు తపస్సు ప్రారంభించాడు. తపస్సులో ఆతను అన్నమే మూలతత్వ మైన బ్రహ్మముగా తెలిసికొన్నాడు.
ఇచ్చట అన్నము అనగా పాంచభౌతిక పదార్థము. సమస్త ప్రాణులన్నీ అన్నం నుండి పుట్టి, పెరిగి, మరణించిన తరువాత ఆ అన్నంలోనే లీన మవుతున్నాయి, కావున అన్నమే బ్రహ్మము అయివుండ వలెనని భావించి తాను దర్శించిన ఆ తత్వాన్ని, తండ్రికి విన్నవించాడు. 
అది విన్న భృగువు సంతృప్తి చెందక " తపస్సు చేత బ్రహ్మాన్ని తెలుసుకో " అని మళ్ళీ కుమారుని ఆదేశించాడు.
భృగువు తిరిగి తపస్సు ప్రారంభించాడు. ఈ సారి శరీరంలో ప్రాణం లేకుంటే అన్నంతో పని ఏమి? ప్రాణం లేని శరీరం అన్నాన్ని గ్రహించ లేదు కదా? కాబట్టి స్థూల సృష్టికి అస్తిత్వం ప్రాణమే. కాబట్టి ప్రాణమే బ్రహ్మమని నిర్ధారణ చేసికొన్నాడు భృగువు.
కుమారుని పరిశీలనను వినిన వరుణుడు, మరోమారు భృగువును తపస్సు చేయమని ఆదేశించాడు.
భృగువు తిరిగి తపస్సు కొనసాగించాడు. ఈ సారి బృగువుకు, మనస్సు బ్రహ్మము గా తోచింది. మనస్సు చేతనే ఈ జగత్తు అంతా ఉత్పన్న మవుతోంది, వృధ్ధి చెందుతోంది, తిరిగి మనస్సు లోనే లయమవుతోంది. కావున మనస్సును బ్రహ్మం గా తలపోశాడు, భృగువు. 
తండ్రిది ఈ సారి కూడా అదే మాట, "తపస్సు చేసి బ్రహ్మాన్ని తెలుసుకో" అంటూ మళ్ళీ ఆదేశించాడు.
కుమారుడు శిరసావహించి తపస్సు కొనసాగించాడు. ఈ సారి ఆతని మనోగతం లో మనస్సు ను కట్టడి చేసేది బుద్ధి, కావున మనస్సు కంటే బుద్ధి సూక్ష్మ మైనదిగా గోచరించింది. కావున తండ్రితో, బుద్ధి బ్రహ్మము అని విన్నవించాడు.
ఈ సమాధానానికి కూడా వరుణుడు సంతృప్తి చెందక కుమారుని మరలా తపస్సుకు ఆదేశించాడు. 
తీవ్రమైన ఆర్తితో అంతరంగాన్ని శోధించాడు భృగువు. అన్నం, ప్రాణం, మనస్సు, బుద్ది, ఈ తత్వాలన్నీ ఒక దానికంటే మరొకటి శ్రేష్ఠ మైనవే మరియు సూక్ష్మ మైనవే అయితే, వీటి అన్నింటి అస్తిత్వానికి హేతువు ఏమిటి? అన్న విషయంపై దీర్గంగా ఆలోచించాడు భృగువు. చివరకు ఆనందము నుండియే ఈ సమస్త ప్రాణులు పుట్టు చున్నవని, ఆనందము చేతనే జీవించు చున్నవి, కావున ఆనందమే బ్రహ్మమని భృగువు అనుభూతి పొందాడు.భృగువు జిజ్ఞాస పరిసమాప్తి అయినది.
జీవుడు, పంచకోశాలు అను ఐదు కోశాలను ఆవరణలు గా పొంది వుంటాడు. ఇవి వరుసగా అన్నమయకోశం,ప్రాణ మయకోశం, మనోమయ కోశం, విజ్ఞాన మయ కోసం మరియు ఆనంద మయ కోశం. ఇవి వరుసగా ఒకటి కంటే మరొకటి సూక్ష్మ తరం. చివరికి ఆనందమయ కోశంలో సత్ చిత్ ఆనంద స్వరూపుడు గా పరబ్రహ్మ స్థితి ని పొంది వుంటాడు జీవుడు.
భృగువు జిజ్ఞాస పరిసమాప్తి అయినది. 
దీనినే భార్గవి వరుణ విద్య అంటారు.ఈ విద్య ను తెలిసికొనిన వాడు బ్రహ్మము నందు సుప్రతిష్టుడగుచున్నా డు. 
ఈ ప్రబోధం నందు, అన్నమును నిందింపరాదనియు, అన్నమును విస్తారముగా పొంది,దానిని వినియోగించ వలయుననియు ఈ రెండూ వ్రతములుగా చేపట్టవలయు ననియు ఉపనిషద్ ఋషి బోధించు చున్నాడు.
Comments
Post a Comment